సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, August 19, 2009

తూ.గో.ప్రయాణం _ మొదటిరోజు(కాకినాడ,బిక్కవోలు,ద్వారపూడి)

రాత్రి గౌతమీ ఎక్కాము.పాప,నేను ఇరుక్కుని పైన బెర్త్ మీద పడుకున్న మూలాన సరిగ్గా నిద్ర పట్టలేదు...మధ్యలో 3.30amకి మెలకువ వచ్చింది. క్రిందకు దిగి తలుపు దగ్గర నిలబడ్డాను.ఏదో స్టేషన్లో ఆగి ఉంది రైలు.పోర్టర్ వెళ్తూంటే అడిగాను ఏ ఊరని.."విజయవాడ" అన్నాడు.అప్పుడర్ధమైంది నాకు ఎందుకు మెలుకువ వచ్చిందో.నేను 28ఏళ్ళు ఉన్న ఊరది..నా ఊరు!!ఇక్కడ దిగిపోతే ..అనిపించింది ఒక్క క్షణం..రైలు కదిలే దాకా అక్కడే నిలబడ్డా..!ఇంక నిద్ర పట్టలేదు.
తెల్లారాకా గోదావరి బ్రిడ్జి మీంచి కొన్ని ఫొటోలు తీసాను..రైలు కాకినాడ వచ్చి ఆగింది.పాతికేళ్ళపాటు ప్రతి రెండు మూడూ నెలలకీ వెళ్ళిన ఊరది.స్టేషను రాగానే ప్రతిసారి రైలులోంచి అన్నయ్యనో,మావయ్యనో వెతికేవి మా కళ్ళు.నేను రాణీవాసం అనుభవించిన మా ఇల్లు కూడా ఉండేది ఒకప్పుడు.ఇప్పుడిక అక్కడ ఆ మనుషులూ లేరు,ఇల్లూ లేదు...బంధువులింట్లోదిగాం.రిక్షా మీద సరదాతో ఊళ్ళో అంతా రిక్షా ఎక్కి తిరిగాము.అదే రోజు బిక్కవోలు,ద్వారపూడి వెళ్ళాలనుకున్నము.బంధువులేర్పాటు చేసిన ఏ.సి.కారులో బయల్దేరాము.రైలులోని ఇరుకుసీటులో నిద్ర సరిగ్గా లేని పాప హాయిగా నిద్రోయింది కారులో.డ్రైవరు మంచి కుర్రాడు.నచ్చిన చోటల్లా ఫోటొలు తీసుకుంటానంటే కారు ఆపాడు పాపం.పచ్చని పొలాల మధ్య నుంచి కారు వెళ్తూంటే,బయటి వాతావరణానికి,స్వచ్చమైన గాలికీ మనసు పరవశించిపోయింది.

బిక్కవోలులో ఉన్నది "లక్ష్మీగణపతి స్వామివారి ఆలయం".విగ్రహం పెద్దగా ఏటవాలుగా వాలినట్లుంది.ఆకుపచ్చని కళ్ళు,నల్లని విగ్రహంతో వినాయకుడు చూడగానే ముచ్చటగా అనిపించాడు.అక్కడి విశేషం ఏమిటంటే,నిస్వార్ధమైన కోరిక ఏదైనా ఒకటి గణపతి చెవిన వేస్తే అది తప్పక తీరుతుందని నమ్మకమట! ఇక్కడ ఫోటోలు అనుమతించలేదు.బయట ఒక ఫొటో కొన్నాం కానీ ఇప్పుడిక స్కాన్ చేసే ఓపిక లేదు. ప్రశాంతత నిండిన మనసుతో అక్కడ నుంచి ద్వారపూడి బయల్దేరాం.

వీలున్న ప్రతివారు దర్శించవలసిన పుణ్య భూమి ఇది.కొన్ని ఆలయాల సముదాయమే ఈ ద్వారపూడి గుడి.
శ్రీ యస్.ఎల్.కనకరాజ్ అనే ఒకగురుస్వామిగారు ఈ దేవాలయాల సృష్టికర్త.అద్భుతమైన శిల్పాలూ,పెద్ద పెద్ద విగ్రహాలూ కన్నులవిందుగా కనపడుతూంటే భక్తితో పరవశించని మనసుండదేమో అనిపించింది. ముఖద్వారంలో పెద్ద నటరాజ విగ్రహంతో,హనుమ,వీరభద్ర విగ్రహాలతో,భూగర్భ జ్యోతిర్లింగాలతో శివాలయం;దుర్గాదేవి ఆలయం;ఆయ్యప్ప స్వామి గుడి;సాయినాధుని దివ్య మందిరం,ఆ వెనుకనే శ్రీరంగం లోని విగ్రహాన్ని పోలిన ఆనంతపద్మనాభస్వామి వారి అందమయిన విగ్రహం;పాప విమోచన ఆలయం;పంచముఖ ఆంజనేయాలయం;పెద్ద పెద్ద చూడ చక్కని శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి,మహానందీశ్వరుల విగ్రహాలూ ఇక్కడ వెలసిన,చూడవలసినా దేవుళ్ళు!!అన్నింటిలోకీ పంచముఖ ఆంజనేయాలయంలో చాలా పవిత్రమైన భావన, ప్రశాంతత నిండిన వైబ్రేషన్స్ అనుభూతి చెందాను నేను...!

మొదట్లో శివాలయానికి ఫొటోలు తీయటమవగానే బ్యాట్రీలు చార్జ్ అయిపొయి ఇక ఫోటోలు తీసే వీలు లేక పోయింది.
రెండవ బ్యాట్రీసెట్ మర్చిపోయాం హడావుడిలో.బయట అమ్ముతున్న ఫోటోల సెట్ కొన్నాం కానీ ఇందాకా రాసినట్లు ఇప్పుడు వాటిని స్కాన్ తీసే ఓపిక లేదు.కాబట్టి మొదటి రోజు ప్రయాణపు ఫొటోల్లో కొన్నింటిని ఇక్కడ పెడుతున్నాను.

(రేపు రాజమండ్రి...గోదావరి కబుర్లు..!!)






23 comments:

భావన said...

బాగున్నాయి తృష్ణా పిక్చర్స్.. గోదావరి కోటి లింగాల రేవు అంటారు కదా అది కూడా చూసేరా? మొన్న ఇండియా వచ్చినప్పుడు మా శరత్ మాస్టారు కోసం రాజమండ్రి వద్దమనుకున్నా కాని కుదరలేదు శేఖర్ గారన్నట్లు వెళ్దామంటే అటు వైపు మచ్చుకు కూడా ఒక్కళ్ళైనా తెలిసిన వాళ్ళు లేరు... ఏమిటో. పోనిలెండీ మీ కళ్ళతో చూపిస్తున్నారు కదా.. చాలు...

భాస్కర రామిరెడ్డి said...

Photos are really good. particularly the "boat with a lil kid" ( last post ).A pure river of Water of Life, clear as crystal.(like konasima).

రాధిక said...

ఆ నందీశ్వరుడి ఫొటో ద్వారపూడి అయ్యప్పస్వామి గుడి పక్కన శివాలయం లోదే కదా?ఫొటోలు పెట్టినందుకు చాలా థాంక్స్.

chandu said...

బాగుందండి. అయితే గుళ్ళు గోపురాల ట్రిప్ అన్నమాట. అలాగే అన్నవరం కూడ చూడండి.

వీరుభొట్ల వెంకట గణేష్ said...

మీది బెజవాడ మాది బెజవాడ :)
ఫోటోలు చాలా బాగున్నాయి.

తృష్ణ said...

@ భావన:అది కోటిపల్లి రేవండి.చూసాము..ఆ కబుర్లు మూడవ రొజు విశేషాలలో చదువుదురుగాని..నాకైతే తెలిసిన వాళ్ళు లేకపోతేనే హాయిగా వెళ్ళిరావచ్చు అనిపిస్తుందండి.ఏ మొహమాటాలూ లేకుండా స్వేచ్చగా,ఇష్టానుసారం తిరగచ్చు...అంటే ఇది చుట్టాలు ఎక్కువగా ఉంటే సంగతి లేండి..:)

తృష్ణ said...

@ భాస్కర రామి రెడ్డి:ఆ దృశ్యం నచ్చే వెంఠనే ఫోటో తీసేసానండీ.తల్లితండ్రులని,చెల్లెలినీ కూర్చోబెట్టుకుని ఆ పిల్లవాడు ధైర్యంగా నదుపుతున్నందుకు ఎంతో అబ్బురం కలిగింది.

@ రాధిక: అవునండి.చూసినందుకు,వ్యాఖ్య రాసినందుకు మీకే డబుల్ థాంక్స్!

తృష్ణ said...

@ చందు:అన్నవరం చాలా సార్లు వెళ్లమండి.అందుకని ఈ సారి వెళ్లలేదు.మీ బ్లాగ్లో బెజవాడ కబుర్లు బాగున్నాయి.మీ పేరు పి.చంద్రశేఖరా?

@ Venkata Ganesh. Veerubhotla:అయితే మనం మనం ఒకటి!!మీ కందిపప్పు ఇక్కట్లు బాగునాయి.ఇక్కడా అదే పరిస్థితి!!

శ్రీలలిత said...

మీది తూ.గో.జీ... మాది తూ.గో.జీ... మాది రాజమండ్రీ అండీ బాబూ.. కాస్త ఆ గోదారిగట్టు మీద నాపేరు చెప్పుకుని షికారు చేసొద్దురూ..సంతోషిస్తాను...

మురళి said...

మా జిల్లాని కళ్ళముందు ఉంచుతున్నందుకు చాలా చాలా థాంకులండీ.. తర్వాతి భాగాల కోసం వెయిటింగ్..

తృష్ణ said...

@ శ్రీలలిత:ఒడ్దున+గొదావరిలో కూడా షికారు చేసేసామండి...రేపు ఆ ఫొటొలు చూద్దురుగాని.

@ మురళి:రాధికగారికి చెప్పిందే మీకూనూ..

శేఖర్ పెద్దగోపు said...

మొదట పెట్టిన పంట పొలాల ఫోటో కొంచేం పెద్దది పెట్టుంటే బాగుండేదండీ...నేను అది నా సిస్టమ్ వాల్ పేపర్గా పెట్టుకుందామని ట్రై చేసా. కానీ చిన్నది అవటం వల్ల కుదర్లేదు. రేపటి ఫోటోలు కోసం ఎదురు చూస్తున్నాను. అన్నట్టు ఈసారి అందులో కొన్ని ఫోటోలైనా కొంచెం పెద్ద సైజ్ ఇమేజ్ పెట్టరూ!!
క్రితం టపాకి మీరిచ్చిన స్పందన చూశాను. మీ అభిమానానికి చాలా థాంక్సండి.

Venky said...

బాగా ఉన్నాయండి విశేషాలు...తెలంగాణ లొ పుట్టి పెరిగి..కర్నాటక లొ చదివి..ఇప్పటికి 10 సంవత్సరాలుగా నాలుగు దేశాలలొ పని చేసి కూడా కొస్తా ఆంధ్ర చూడాలనే నా కొరిక, కొరిక గానే మిగిలి పొయింది. మీ బ్లాగు వల్ల ఆ ప్రదేశాలన్ని కల్లకు కట్టినట్టుగా చూసినట్టు ఉంది.

తృష్ణ said...

శేఖర్ గారూ,నా ఫొటోస్ అన్నీ రీసైజ్ చేసాకా మికు లింక్ ఇస్తాను.అప్పుడు మి పి సి లొ పెట్టుకుందురుగాని.సరేనాండి. జీవితాన్ని మనం ఎంత ఆనందించాం అనేదాని కన్నా,మనం ఇతరులకు ఎంత సంతోషాన్ని ఇచ్చాం అన్నదే ముఖ్యమని నా అభిప్రాయం అండి.

@venky:its my pleasure.thankyou.

Bhãskar Rãmarãju said...

particularly the "boat with a lil kid" ( last post ).A pure river of Water of Life, clear as crystal.(like konasima).
ఆ దృశ్యం నచ్చే వెంఠనే ఫోటో తీసేసానండీ.తల్లితండ్రులని,చెల్లెలినీ కూర్చోబెట్టుకుని ఆ పిల్లవాడు ధైర్యంగా నదుపుతున్నందుకు ఎంతో అబ్బురం కలిగింది
???
ఎక్కడ్వయా? ఎక్కడున్నదీ గీ పుటో?
సమఝ్గాలే.

శ్రీ said...

బాగున్నాయి గోదావరి ఫొటోలు.రాయలసీమలో పుట్టిన నాకు గోదావరి దర్శన భాగ్యం ఇంతవరకు కలగలేదు.ఒక నెల రోజులు అక్కడ ఉండేటట్టు ప్లాన్ చెయ్యాలి ఈసారి.

మీ మిగత కబుర్ల కోసం ఎదురుచూస్తూ ఉంటాను.

తృష్ణ said...

@ bhaskar ramaraju:that is from y'day's post sir.okasaari bhaskar ramireddy gaari comment malli chadavandi.

@sri:tappaka vellamdi chaalaa enjoy cheyyachchu.thanks for the visit.

పరిమళం said...

బిక్కవోలుకు చాలాదగ్గర అమ్మమ్మగారి ఊరు ..ఇప్పుడు అమ్మావాళ్ళు అక్కడే ఉంటున్నారు . ద్వారపూడి గుడులు తెలిసినవే అయినా మీ టపాతో మరోసారి తలుచుకోవడం చాలాబావుంది .

తృష్ణ said...

@పరిమళం:ద్వారపూడి గుడులు మాత్రం మనసు దోచేసాయండీ.ధన్యవాదాలు.

కొత్త పాళీ said...

ఇన్నాళ్ళు తీరిక లేక మీ యీ సీరియల్ చదవలేదు. ఇప్పుడు ఒక్కబిగిన, ఆఖరి భాగం నించీ చదువుకుంటూ వచ్చా.
ఇక్కడ బిక్కవోలు, ద్వారపూడీ పేర్లు చదివితే శ్రీపాద వారి కథలు గుర్తొచ్చాయి.

తృష్ణ said...

@కొత్తపాళీ:ధన్యవాదాలు.

Unknown said...

bikkavolu, dwarapudi tour chala baga chesarandi babu,

vihari said...

thanks im vihari from biccavolu