సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, August 22, 2009

తూ.గో.ప్రయాణం__ఆఖరిమజిలీ(యలమంచలి)




యలమంచలి దగ్గర మా బంధువుల్లో ఒకరు వర్క్ చేస్తున్న అగ్రికల్చురల్ ఫార్మ్ ఉంది.గార్డెనింగ్ అంటే విపరీతమైన పిచ్చి ఉన్న నాకు ఆ ఫార్మ్ చూడాలని ఎన్నో ఏళ్ళ కోరిక. యానామ్ దాకా ఎలాగూ వెళ్తున్నాం ఇంకొంచెం ముందుకు,విశాఖ జిల్లా అంచులదాకా వెళ్ళి అది కూడా చూసేద్దాం అని మావారి చెవిలో జోరీగలా పోరేసా...సర్లెమ్మన్నారు.యానాం నుంచి బస్సులో యలమంచలి వెళ్దామని పొద్దున్నే లేచి బస్టాండ్ కు చేరాం.రెండు గంటలు కూర్చున్నా మాకావాల్సిన బస్సు రాలేదు.మేము వెళ్ళి మళ్ళీ గౌతమీ టైముకి కాకినాడ రావాలి.అక్కద ఉండే టైము తగ్గిపోతోందని కంగారు నాకు...ఆఖరుకు ఒక సహప్రయాణికుని సలహాపై ముందర కాకినాడ వెళ్ఫోయి అక్కద విశాఖ వెళ్ళే ఎక్సప్రెస్స్ బస్సు ఎక్కాం....అది అలా నెమ్మదిగా అన్నవరం దాటి...వెళ్లి వెళ్ళి...మేం ఆ ఊరు చేరే సరికీ మధ్యాహ్నం పన్నెండు..!!

పొద్దున్నే 4.30కి లేచిన మా కడుపుల్లో ఎలకలు పరిగేడుతూంటే ఆవురావురుమని పెట్టిన తిఫిన్ మాట్లాడకుండా లాగించేసాం.
భోజనాలు తర్వాత అనుకుని ఇంక అన్నాయ్యగారి ఫార్మ్కు బయల్దేరాము.చుట్టుపక్కల ఉన్న నలభై మందలాల్లో ఇరవై మండలాలవాళ్ళు వీళ్లదగ్గరే మొక్కలు కొనుక్కుంటారుట.మామిడి,అరటి,జామా,పనసా ఇలా చాలా రకాల పళ్ళ రకాలూ,టమోటా,వంగ,చిక్కుడు రకాలూ,బెన్డ వంటి కాయగూరలూ,రకరకాల పంటల గ్రాఫ్టింగు,హైబ్రిడ్ వెరైటీలూ వీళ్లు తయారు చేస్తారుట.అదంతా కొండ ప్రాంతం.బీడు భూమి...ఎక్కువ నీరు లేకున్నా,అదంతా సాగు చేసి పచ్చని తొటల్ని పెంచారు.చిన్నప్పుడు దూరదర్షన్లో కృషిదర్షన్,డిడి8 లో వ్యవసాయదారుల కార్యక్రమాలూ బాగా చూసే దాన్ని.నాకెందుకో సరదా..అప్పుడే నాకు ఈ గ్రాఫ్టింగు,హైబ్రీడైజేషన్...మొదలైన విషయాలపై అవగాహన వచ్చింది.చక్కగా ఓ చిన్న పొలం కొనుక్కుని అందులో ఓ గుడిశ వేసుకుని పొలం చేసుకుంటూ జీవితం గడిపెయాలని కలలు కూడా కనేదాన్ని...!!

ఫార్మ్ కబుర్లలోకి వచ్చేస్తే....తక్కువ నీరుతో ఎక్కువ దిగుబడి ఎలా సంపాదించాలి,నీరు లేకపోయినా రెండు,మూడు రకాల మొక్కలతో పంటని ఎలా పచ్చగా ఉంచాలి మొదలైనవి వాళ్ళు రైతులకు తెలియచెప్పే పరిశోధనాత్మక వివరాలు.పాషన్ తో,అంకితభావంతో 17,18 ఏళ్ల ఆయన అనుభవాలూ,పరిశోధనల వివరాలూ,వాళ్ళ ఏక్టివిటీస్ అన్నీ ఆయన చెప్తూంటే..చాలా ఆనందం కలిగింది.ఆ సంస్థ పరంగా ఆయన చేస్తూన్న కృషి అపూర్వం!!చేసే వృత్తి మన ప్రవృత్తికి సరిపడేదైతే,అందులో మనల్ని మనం మరిచేటంత అలౌకికానందం మనం పొందుతూంటే,మనం చేసే పని కొన్ని వందల మందికి ఉపయోగపడ్తూంటే,జీవనోపాధి కల్పిస్తూంటే.....జీవితానికి ఇంతకన్నా సార్ధకత ఉండదేమో అనిపించింది.

ఈ నాలుగురోజుల్లో,మనసు నిండా బోలేడు తియ్యని అనుభవాలూ,మరువలేని జ్నాపకాలూ నింపుకుని...సమయాభావం వల్ల బస్సు వదిలి,టాక్సీ ఎక్కి కాకినాడ సకాలంలో చేరి..మా రైలు ఎక్కాం!ఈసారి ముందుగానే సైడ్ లోయెర్లో తిష్థ వేసి,సీటు మార్పిడి చేసుకుని సుఖంగా నిద్రపోయాం పాపా,నేను!!
మొత్తానికి మా ప్రయాణం విశేషాలు పూర్తయ్యాయి....బాధని మనసులో దాచుకోగలం కానీ ఆనందాన్ని ఎవరితోనూ పంచుకోకుండా ఉండలేము....అన్న నా అభిప్రాయమే ఈ అయిదు టపాలకీ పునాది.

9 comments:

మరువం ఉష said...

తృష్ణ, చక్కని అనుభవం కదూ? మేము కూడా ఈ ప్రదేశాలు అన్నీ చూసాము, నాకు ద్రాక్షారామం బాగా నచ్చింది. మండపేట నుండి పంటి మీద లోపలి లంకల్లోకి వెళ్ళి, కొబ్బరి తోటల్లో గడిపి వచ్చిన రోజులు జ్ఞప్తికివచ్చాయి. పంచుకుంటే సగం అయ్యేది, రెట్టింపు అయ్యేది ఆనందమూను. మీరింక ఇలా ఎన్నో సుఖ ప్రయాణాలు చేసి అవి మాకు పంచాలని ఆకాంక్షిస్తూ..

తృష్ణ said...

ఉషగారు,ధన్యవాదాలండి..ఉభయ గోదావరి జిల్లల్లో ఇంకా చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి..వెళ్ళాలి మరొసారెప్పుడో..!!

మురళి said...

మీ ట్రావేలోగ్ అప్పుడే అయిపోయిందా? చాలా చక్కగా రాశారండీ.. ఇంతకీ ఫాం నుంచి ఏమేం మొక్కలు తెచ్చుకున్నారో చెప్పనే లేదు మాకు..

తృష్ణ said...

@ మురళి: మా అన్నాయ్యగారు ఇస్తానన్నారు కానీ అప్పటికే లగేజీ చాలా ఎక్కువైపోయి ఇంక ఆ ప్రయత్నం మానుకున్నానండి..ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉన్న ఫాం లోకి అందుకే అడుగు పెట్టలేదు.వెళ్తే ఇక అక్కడే మకామేసేస్తానని.."వెర్మీకంపోస్ట్" మాత్రం తెచ్చుకున్నాను :)

శేఖర్ పెద్దగోపు said...

>>>చిన్నప్పుడు దూరదర్షన్లో కృషిదర్షన్,డిడి8 లో వ్యవసాయదారుల కార్యక్రమాలూ బాగా చూసే దాన్ని.నాకెందుకో సరదా..అప్పుడే నాకు ఈ గ్రాఫ్టింగు,హైబ్రీడైజేషన్...మొదలైన విషయాలపై అవగాహన వచ్చింది.చక్కగా ఓ చిన్న పొలం కొనుక్కుని అందులో ఓ గుడిశ వేసుకుని పొలం చేసుకుంటూ జీవితం గడిపెయాలని కలలు కూడా కనేదాన్ని...!!

సేం టు సేం ఇక్కడ కూడా...ఇప్పటికీ ఆ ఆలోచన ఉందనుకోండీ..

>>>చేసే వృత్తి మన ప్రవృత్తికి సరిపడేదైతే,అందులో మనల్ని మనం మరిచేటంత అలౌకికానందం మనం పొందుతూంటే,మనం చేసే పని కొన్ని వందల మందికి ఉపయోగపడ్తూంటే,జీవనోపాధి కల్పిస్తూంటే.....జీవితానికి ఇంతకన్నా సార్ధకత ఉండదేమో అనిపించింది.

రెండొందల పర్సేంట్ కరెక్ట్ గా చెప్పారు.

>>>బాధని మనసులో దాచుకోగలం కానీ ఆనందాన్ని ఎవరితోనూ పంచుకోకుండా ఉండలేము..

అవునండీ..నిజమే.
ఎందుకో ఈ అనుభవాల టపాలలో కొన్ని మీరు ఇంకా బాగా రాయగలరేమో అని నాకు అనిపించిందండీ( అక్కయ్య మరోలా అనుకోరన్న నమ్మకంతో చెప్పే ధైర్యం చేసేసాను). :)

తృష్ణ said...

శేఖర్ గారూ,ఇందులో అనుకొవటానికి ఏముందండీ...బాధ కలిగేలా విమర్శిస్తే ఏమన్నా అనుకుంటాం. గానీ..!!
చేసే ప్రతి పనిలోనూ పర్ఫెక్ట్ గా ఉండాలని తాపత్రయపడే నేను కూడా అనుకుంటానండి ఇంకా బాగా రాయచ్చు అని ...కానీ నా సమాధానం ఏమిటంటే..
1)నేను రచయిత్రిని కాదు కబట్టి,నా భావాలని ఇంతకన్నా అందంగా,ఉన్నతమైన పదజాలం ఉపయోగించి రాయలేను మరి...నాకు భాషాపరిజ్ఞానం చాలా తక్కువనే చెప్పాలి.
2)రచయిత్రిని కాకపొయినా కొంచెం కష్టపడితే రాయగలుగుతానేమో కూడా...కానీ సంసార సాగరంలో పడి కొట్టుకుపొయే నాబోటి సామాన్య గృహిణులకు మనోభావాలను ప్రకటించుకోటానికి ఈ మాత్రం వెసులుబాటు దొరకటమే అపురూపం...
3)సమయం వెచ్చించ్చే అవకాశం దొరికితే తప్పక ఇంకా బాగా రాయటానికే ప్రయత్నిస్తానండి.

నేనేమీ అనుకొలేదండి.మీ సజషన్ కి ధన్యవాదాలు.

మా ఊరు said...

ఇప్పటి వరకు వరంగల్ హైదరాబాద్ తప్ప ఏమి చూడలేదు .మీ టపా చదివాక ఒక్కసారైనా చూడాలన్న కోరిక కలుగుతుంది.ఈ సారి ఇండియా వస్తే తప్పకుండ గోదావరి జిల్లాల్లో పర్యటన చేస్తా.

కొత్త పాళీ said...

చాలా సంతోషం, మీరు చూడాలనుకున్న ప్రదేశాన్ని చూడగలిగినందుకూ, మాతో ఇలా పంచుకున్నందుకూనూ. వ్యవసాయంలోనే ఇలా సైలెంటుగా తమ పని తాము చేసుకు పోతూ ఎన్నో అద్భుతాల్ని సాధిస్తున్న మహానుభావులున్నారు.
మీరు బాగా రాస్తారు, సందేహమేం లేదు. పత్రికల్లో వచ్చే రాతలకీ, ఇలా బ్లాగులో రాసుకునే దానికీ ముఖ్యమైన తేడా నిజాయితీ. మీ రచనల్లోని ఆ నిజాయితీయే మా లాంటి పాఠకుల్ని పదే పదే మీ బ్లాగుకి రప్పిస్తుంది.

తృష్ణ said...

@ మా ఊరు:రాసిన 3,4 రొజుల తరువాత కూదా వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు.తప్పక ఆ ప్రదేశాలని చూడండి.విలైతే కోనసీమ మొత్తం చూడండి.చాలా బాగుంటుంది.

@కొత్తపాళీ: కృతజ్ఞతలు.iam honoured.