సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, March 16, 2011

మల్లాది సూరిబాబుగారి గాత్రం


"మల్లాది సోదరులు"గా పేరుగాంచిన కర్ణాటక సంగీతకళాకారులు మల్లది శ్రీరామ్ ప్రసాద్, మల్లది రవి కుమార్ సోదరుల తండ్రిగారు శ్రీ మల్లది సూరిబాబుగారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సీనియర్ అనౌన్సర్ గా రిటైరయ్యారు. నాన్నగారి కొలీగ్ కావటంతో చిన్నప్పటి నుంచీ పరిచయం. సూరిబాబు మావయ్యగారు అనే ఇప్పటికీ పిలుస్తాను. ఇటీవలే ఇంటికి వెళ్ళినప్పుడు మావయ్యగారిని చాలా ఏళ్ళతరువాత కలవటం కూడా జరిగింది. మావయ్యగారు చాలా బాగా పాడతారు. మా చిన్నప్పుడు ఎప్పుడటువైపు వెళ్ళినా శిష్యులతో వాళ్ళ ఇల్లంతా నిండిపోయి ఉండేది. లలిత, శాస్త్రీయ సంగీతాలను ఆయనవద్ద నేర్చుకోవటానికి ఎంతో మంది పొరుగూళ్ల నుంచి కూడా వస్తూండటం నాకు తెలుసు. నాకెంతో ఇష్టమైన ఆయన గాత్రంలో ఒక భక్తి గీతం ఇక్కడ వినండి. రొటీన్ గా కాకుండా ఒక విశిష్ఠతతో వినేకొద్దీ వినాలనిపించే ఆయన గాత్రం చాలా బావుంటుంది.

రచన: ఆదూరి శ్రీనివాసరావు
గానం: మల్లది సూరిబాబు
ఆల్బం: సాయినాదఝరి




వీడకుమా విడనాడకుమా (2)
ఎదనుండి ఎడబాయకుమా(2) llవీడకుమాll

కనులలో దాగిన కాంతివి నీవు
చెవులకు వినికిడి శక్తివి నీవు
దేహము లోని దేహివి నీవు(2)
ఆకృతిలేని ఆత్మవు నీవు llవీడకుమాll

సత్యము తెలిపిన సద్గురు స్వామివి
అందరిలోనీ అంతర్యామివి
శ్రీశైలములో సుందర శివుడవు
పళనిలో వెలసిన శరవణభవుడవు llవీడకుమాll

ఏమరుపాటుతో మిడిసిపాటుతో
ఎపుడైనా నే తలచకున్నను
కంటికి రెప్పగా కాయుము దేవా
తీరుగా నడుపుము జీవన నావ llవీడకుమాll

*******************

ఇది మరో చిన్న ఆలాపన. "నిశ్శబ్దం-గమ్యం" అనే నాన్నగారి అవార్డ్ ప్రోగ్రాం లోది. ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు రాసిన ఈ వాక్యాలు ఎంత సత్యమో కదా అనిపిస్తాయి.


ఇక్కడని అక్కడని ఎక్కడ ఎన్ని శిఖరాలెక్కినా
ఒక్కనాడూ...
ఒక్కనాడూ మనిషి లోపలి లోభము ఎక్కడ తీరదూ
మనిషి లోపలి లోభమెక్కడ తీరదూ...




8 comments:

సుజాత వేల్పూరి said...

తృష్ణ , I love you ...... for this post! Thanks a million!

సూరి బాబు గారి లలిత గీతాలు ఉన్నాయా మీ దగ్గర? ప్రత్యేకంగా "కలలో నీలిమ గని" ఉందా?అలాగే ఆయన " ఆకసాన వేవెలుగుల సూర్యుడు" అని ఒక పాట పాడారు? అదుందా? అదో? అవి కూడా పెట్టొచ్చుగా! ఏమ్మా, అంత కుళ్ళూ?

ఏమిటో మనసంతా దిగులుగా ఐపోయింది ఈ గాత్రం విని!

కానీ ఆయన పిల్లలిద్దరూ తండ్రి వారసత్వాన్ని పుచ్చుకుని మేటి గాయకులుగా నిలబడ్డం ఎంతో సంతోషాన్ని కల్గించే విషయం!

సుజాత వేల్పూరి said...

ఈ గీతం రేవతి రాగం కదూ! జలుబు చేసినట్లుండే సూరిబాబు గారి వాయిస్ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం

నైమిష్ said...

ఒకరకమైన హస్కీనెస్ తో వుండే సూరిబాబు గారి గళం నాకు చాలా సుపరిచితం..దూరదర్శన్లో ఆయన తెలుగు ఘజల్స్ ( 90 లలో) ఒక నూతన ఒరవడికి నాంది పలికాయి..మీ బ్లాగులో ఆయన గురించి చదవటం ఆనందకరం..ఆయనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ..

తృష్ణ said...

@సుజాత: ఈ టపాకు మొదట మీ వ్యాఖ్య వస్తుందని తెలుసుగా...:)
"కలలో నీలిమ గని..నీలిమలో అగరుపుష్పజాలిమి గని..అగరుధూప లతికవోలె...." ఎన్నిసార్లు విన్నానో...పెడతాలెండి..చూస్తూ ఉండండి...!! ఆసక్తి ఉన్నవాళ్ళు తక్కువ కదా అని బధ్ధకం..

ప్రసాద్,రవి ఇద్దరూ కూడా ఆయనను మించిన పేరు తెచ్చుకోవటం ఆనందకరం. వారిద్దరికీ ఇంకా ఎంతో పేరు ప్రఖ్యాతలు రావాలని కోరుకుంటున్నాను.

ఇక మొదటిపాట "మిశ్ర రేవతి" రాగం,ఆదితాళం. "రేడియో మిర్చి"లో పొద్దున్నే దేవరాగం అని 5 to7 వస్తుండి కదా ఆ కార్యక్రమం మొదట్లో ఒక రాగాలపన వస్తుంది విన్నారా? "సారీమా రిమా మాపమపా పానీసరీ రీసా.." అని అది కూడా రేవతి రాగమే. బావుంటుంది చాలా. ఇంకా ఝుమ్మంది నాదం(సిరిసిరిమువ్వ), మానసవీణా మధుగీతం(పంతులమ్మ), సరే సరే ఓరన్నా(స్నేహం) మొదలైన సినిమాపాటలు కూడా రేవతి రాగంలో చేసినవే.

నే పెట్టిన రెండవ బిట్ సింధుభైరవి రాగం.
Thanks for the comment...:)

తృష్ణ said...

@నైమిష్: అవునండీ ఆ హస్కీనెస్సే ఆయన వాయిస్ ను పెక్యూలియర్ గా ఉంచింది. ఆయన తెలుగు గజల్స్ కేసెట్స్ కూడా చేసారు. మీకు తెలియటం సంతోషకరం.

ధన్యవాదాలు.

Sreenivas Paruchuri said...

First of all big thanks for talking about సూరిబాబు గారు! పొద్దున్నే ఆఫీసుకి బయలుదేరే ముందు యాదృఛ్ఛికంగా మీ బ్లాగు చూడటం జరిగింది. మొదటి పాట 10-15 సెకణ్డ్లు వినగానే ఓలేటిగారి "ఆకటివేళల అలపైన వేళల" (అన్నమయ్య) గుర్తుకొచ్చింది. ఆ పాట కూడా రేవతి రాగంలో వుంటుంది.

మీ వీలుని బట్టి సుజాతగారడిగిన రెండు పాటలతో పాటు, "నిశ్శబ్దం-గమ్యం" *పూర్తి* రూపకం కూడా వినిపించండి. పదేళ్ళ క్రితం మీ నాన్నగారు శ్రీకాంతశర్మగారి పాటలని కొన్నింటిని సంకలించి సమర్పించినప్పుడు అందులో నిశ్శబ్దం-గమ్యం నుంచి నాలుగు చిన్న బిట్లను చేర్చారు. ఆ సంకలనం అంటే గుర్తుకొచ్చింది. నిజానికి ఎప్పటినుంచో మిమ్మల్ని అడుగుదామనుకుంటున్నాను. మీ నాన్నగారు చేసిన "ఒక పాట పుట్టింది" (విజయరాఘవరావుగారు స్వరపరిచిన, రత్నం గారి గొంతులో అపురూపంగా ధ్వనించిన - ఆవిడ గొంతులో అన్ని పాటలు నాకు గొప్పగానే వుంటాయనుకోండి! - తిరునాళ్ళకు తరలొచ్చే కన్నెపిల్లలా అన్న పాట పుట్టుక కథ) వినిపిస్తారా!

అసలు సూరిబాబుగారి లలిత గీతాల గురించి చెప్పలేదు. నా అభిమాన గీతాలు చాలానే వున్నాయి. బాధలో నిరాశలో ... (ఇంద్రగంటి రచన) నివాత శూన్యస్తంభం నిష్పీడన ... (రజనిగారి రచన) ఇలా... ఆయిన పాడిన లలితగీతాలొక ఎత్తైతే, ఆయన అయిదారేళ్ళక్రితం ఒక సంవత్సర కాలం పాటు ప్రతి సోమవారం నడిపిన లలితగీత లహరి మరో ఎత్తు. బోలెడు అపురూపమైన పాత గీతాల్ని, TS రికార్డుల్ని వినిపించారు. నా లలిత సంగీతం పిచ్చి తెలిసిన పెద్దమనిషొకరు తెనాలిలో - ఆయనకంత ఆసక్తి లేకున్నా - ఈ కార్యక్రమాన్ని రికార్డు చేసిపెట్టారు.

చెప్పటానికి చాలావుంది కానీ, మరోసారి ...

ధన్యవాదాలతో
-- శ్రీనివాస్

తృష్ణ said...

@పరుచూరి శ్రీనివాస్: చాలా సంతోషం. నిజంగా నేను కూడా చాల రోజుల్నుంచీ నాకు చాలా ఇష్టమైన శర్మగారి "తిరునాళ్ళకు" పాట గురించి రాయాలని..ఏమిటో బధ్ధకిస్తూ వస్తున్నా. త్వరలో తప్పకుండా పెడతానండి. వ్యాఖ్యకు ధన్యవాదాలు.

Venkata Madduri said...

Audio file is missing Ms.Trishna garu.