సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, October 9, 2012

నా ఉదయాలు..




రివ్వున వీస్తున్న పవనాలు మనసుని చల్లబరుస్తాయి
పచ్చదనంతో మెరుస్తున్న పైర్లు తలలుపుతూ శుభోదయం చెప్తాయి
కరెంట్ తీగ మీద వాలిన నీలిరంగు పిట్ట నా అందం చూడమంటుంది
హడావుడిగా పరిగెడుతున్న తొండ తలఊపి హలో చెప్తుంది.




పువ్వుల చుట్టూ తిరగాడే రంగురంగుల సీతాకోకచిలుకలు.. 
నా కెమేరాకు అందకుండా కవ్విస్తాయి
మంచుతో తడిసిన గడ్డిపరకలు తళుక్కుమంటుంటాయి
మబ్బుల మధ్యనుండి తొంగి చూస్తున్న సూరీడు 
అప్పుడే రానా.. వద్దా.. అని ఊగిసలాడుతూంటాడు
 తోటలోని ఎర్రని,తెల్లని గులాబీలు విరగబూసి 
నన్ను చూడు..నన్ను చూడు అంటూ గోముగా పిలుస్తూంటాయి



ఈ అందాలతో పనిలేదన్నట్లు ఆ పూరిపాకలోని పాప.. 
తనలోకంలో తాను కేరింతలు కొడుతుంటుంది
ఎర్రని చిగుర్లతో వేపచెట్లు నోరారా పలకరిస్తాయి కానీ
చేతులు చాచుకుని కూచున్న చింతచెట్లు ఎందుకో భయపెడతాయి!


ముళ్లచెట్టు మధ్యన నీలిపూలు మనోహరంగా కనబడతాయి
విరగబూసిన నందివర్థనాలు వెన్నెలని తలపిస్తాయి
నాకు తోడుగా చెవిలో కబుర్లాడుతున్న రేడియో జాకీ
కమ్మని పాటలతో నా ఆనందం పరవళ్ళుతొక్కుతుంది..


అలా.. ఈ ప్రకృతితో నేనూ మమేకమై పరవశించేవేళ
కుయ్యి మన్న రైలు కూతతో ఉలిక్కిపడతాను!
సందుచివర్లో కనబడుతున్న స్కూలు బస్సులు
ఇక చాలు ఈ లోకంలోకి వచ్చేయమని తొందరపెడతాయి
ప్రతి రాత్రీ రేపటి అనుభూతి గురించి కలలు కంటూ నిద్దరోతానా..
మళ్ళీ ఉదయానే నిన్నటి అనుభూతుల్ని వెతుక్కుంటూ నడచిపోతాను...





12 comments:

PRASAD said...

vahva ! vahva !! You are very fortunate !!! Please enjoy yur mornings !!!

Prasad

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగున్నాయండీ మీ కబుర్లు.. కంక్లూజన్ భలే నచ్చింది.

రాధిక(నాని ) said...

బాగుందండి

Krishna Palakollu said...

Lovely mornings isnt it :-)
Enjoy heartfully!

శిశిర said...

ప్రతి రాత్రీ రేపటి అనుభూతి గురించి కలలు కంటూ నిద్దరోతానా..
మళ్ళీ ఉదయానే నిన్నటి అనుభూతుల్ని వెతుక్కుంటూ నడచిపోతాను...

బాగుందండీ.

మధురవాణి said...

భలే భలే! మీకిలాంటి అందమైన ఉదయాలు మరెన్నో అందాలనీ, ఇంకా బోల్డు మంచి కవితలు రాసెయ్యాలనీ కోరుకుంటున్నాం.. :)

Unknown said...

you are so lucky how beautiful is it

అనంతం కృష్ణ చైతన్య said...

"విరగబూసిన నందివర్ధనాలు వెన్నెలను తలపిస్తాయి" నాకు ఈ లైన్ ఎంత నచ్చిందో చెప్పలేను............ మీరు చాల లక్కీ అండీ, మేమూ ఉన్నాం!!! ప్రొద్దున్నే కైకైమంటూ వెహికల్స్ హార్న్లు, రైరైమంటూ పరుగెడుతూ బస్సులూ, దానికి గబ్బిలంలా వ్రెళ్ళాడుతూ "నేను".....
ఓడమ్మా జీవితం!!!! ఓ ఉదయం పచ్చదనం లేదు, రాత్రి వెన్నెల లేదు. చంద్రున్ని చూసి ఎంతకాలమైందో........ ప్చ్చ్!!! మీ బ్లాగ్పోస్ట్ చూసినతర్వాత కొంచెం రెలీఫ్ గా ఉంది......... thank you so much madam........ :)

Dantuluri Kishore Varma said...

తొండ తల ఊపి హలో చెప్పడం, చేతులుచాచుకొన్న చింతచెట్లు భయపెట్టడం...తమాషాగా ఉన్నాయి.

జయ said...

చాలా మంచి వాతావరణం లో ఉంటున్నారు. అభినందనలు.

తృష్ణ said...

@ప్రసాద్ గారూ:
@వేణు శ్రీకాత్ గారూ:
@రాధిక గారు:
కృష్ణ పాలకొల్లు గారూ,
@శిశిర గారూ,
@మధుర,
@రమేష్ గారు,
@jaya గారు,
నా అనుభూతులు నచ్చినందుకు ధన్యవాదాలు.

తృష్ణ said...

@కృష్ణ చైతన్య గారూ.. ఏం అనాలో తెలీట్లేదు..good luck in future :)
ధన్యవాదాలు.

@దంతులూరి కిషోర్ వర్మ గారూ, మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో మరి.. తొండ చెట్టుపై కొమ్మ మీంచి, లేక పరిగెడూతూ ఆగి తల ఊపుతుంది. ఒక్కసారి కాదు అలా కాసేపు ఊపుతుంది. చిన్నప్పుడు మాకు చాలా సరదాగా ఉండేది అలా చూడటం. మళ్ళి ఇన్నాళ్ళకి..ఇక్కడ తొండ తలఊపుతూ కనిపిస్తోంది.
ఇక మా ఇంటివద్ద చింత చెట్లు చాలా పెద్దగా ఉంటాయి. ఏనాటివో..! అవి చూడటానికి చేతులు చాచుకుని భయపెడుతున్నట్లు నాకు అనిపిస్తుంది..:) అదండి సంగతి.
ధన్యవాదాలు.